About Me

వందన శ్రీనివాస్ పేరిట కార్టూన్స్ వేస్తోన్న నా పేరు శ్రీనివాస్ కర్రి.
అంతస్థులూ ఐశ్వర్యాలూ చేకూర్చి పెట్టలేకపోయినా వున్నంతలో జీవిత భాగస్వామిగా నాతో నడిచొచ్చిన భార్యకి సముచిత స్ధానం ఇచ్చినట్టు వుంటుందని కార్టూన్ లను ఆమె పేరు జోడించి వందనశ్రీనివాస్ అని వేస్తూ వస్తున్నానంతే !

నా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామం. నాన్నగారు బ్రహ్మశ్రీ కర్రి భీమలింగాచారి, రెవెన్యూ ఎంప్లాయ్, అమ్మ శ్రీమతి సరస్వతి. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు టెక్కలి లోనే చదివాను.
ఉద్యోగ రీత్యా 34 య్యేళ్లుగా డెక్కన్ క్రానికల్, విశాఖపట్నంలో సెటిలై పోస్టుగ్రాడ్యుయేషన్ మాత్రం విశాఖపట్నం లో చదివాను.
ఎనిమిదీ తొమ్మిదీ తరగతులు చదివేనాటినుంచే కార్టూన్లను ఆసక్తిగా చూసే వాడిని. నా తొలి కార్టూన్ ఇంటర్ చదివే రోజుల్లో ఆంధ్రభూమి వీక్లీలో పబ్లిష్ అయింది. కార్టూనింగ్ కేవలం నా హాబీగా ఇప్పటి వరకు దాదాపు నాలుగువేల పైచిలుకు వేశాను.
12.12.2021 నాడు మరియు తిరిగి 18.12.2021నాడు మన కార్టూనిస్టులు కార్యక్రమం ద్వారా దూరదర్శన్ వారు నన్ను పరిచయం చేయడం, ఉభయ తెలుగు రాష్ట్రాల కార్టూన్స్ పోటీల్లో తలిశెట్టి ఆవార్టు’2022 ప్రథమ బహుమతి తో పాటు మరికొన్ని ప్రత్యేక బహుమతులు అందుకోవడం, సమ్మర్ క్యాంపుల్లో పిల్లలకు కార్టూనింగ్ మెళకువలు నేర్పడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
నఖ చిత్రాలు వేయడం నాకు చిన్నప్పటినుంచీ అలవాటు. చాలా వరకు పబ్లిష్ అయ్యాయి కూడా.
కథలూ రాశాను. అవీ చాలా వరకు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. విశాఖ రచయితల సంఘం (విరసం) వారు ప్రచురించిన సంకలనం లో నా కథలు మూడు ప్రచురించి పుస్తకావిష్కర సమయంలో ప్రముఖ రచయితలు శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు, శ్రీ అడపా రామకృష్ణ ల చేతులమీదుగా మెమొంటో అందుకోవడం, శ్రీ కళాసాగర్ గారు ప్రచురించిన ‘కొంటెబొమ్మలబ్రహ్మలు’ పుస్తకంలో నాకూ ఓ మూడు పేజీలు కేటాయించడం నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను.
ఆటల్లో చదరంగం అంటే చాలా ఇష్టం. ప్రతియేడూ జరిగే ఇంటర్మీడియా చెస్ టోర్నమెంట్స్ లో 5 సార్లు టైటిల్ సాధించగలిగాను.

ఈ లోకంలో లేకున్నా తల్లిదండ్రుల ఆశీస్సులు వల్లనే కళల ద్వారా నేను ఈ ఆనందం పొందగలుగుతున్నానని నా పూర్తి నమ్మకం !

..నమస్కారములతో
మీ Srinivas Karri.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *